కోట్ల విలువ‌చేసే భూమి చుట్టూ రాజ‌కీయాలు

 * కుంట్లూరులో 1750 గ‌జాల భూమిపై నేత‌ల క‌న్ను
* దాన్ని ప్ర‌భుత్వ భూమిగా చెప్పిన త‌హ‌సీల్దార్‌
* కోర్టులో ఇంజంక్ష‌న్ ఆర్డ‌ర్ ఉన్నా క‌బ్జా చేస్తున్న గౌడ సంఘం

హైద‌రాబాద్‌, ఆగ‌స్టు, 2023: అది హ‌య‌త్‌న‌గ‌ర్ స‌మీపంలోని కుంట్లూరు మ‌ద‌ర్ డెయిరీ స‌మీపంలో ఉన్న 1750 గ‌జాల విలువైన భూమి. గ‌జం భూమి విలువ రూ. 35 వేల నుంచి రూ.45 వేల వ‌ర‌కు ఉండే ఈ ప్రాంతంలో క‌నీసం రూ.7 కోట్ల‌కు పైగా విలువ చేసే ఈ ప్రైవేటు భూమిపై రాజ‌కీయ గ‌ద్ద‌ల క‌న్ను ప‌డింది. స‌ర్వే నెంబ‌ర్ 206లో ఉన్న ఈ భూమిని బాధితులు మూడు ద‌శాబ్దాల క్రిత‌మే.. 1990లో రిజిస్టర్డ్ సేల్ డీడ్ ద్వారా కొనుగోలు చేశారు. దీని ప‌క్క‌నే ఉన్న స‌ర్వే నెంబ‌ర్ 159లో ప్ర‌భుత్వ భూమి ఉంది. ఆ భూమిని గౌడ సంఘానికి ప్ర‌భుత్వం కేటాయించి, అక్క‌డ కార్యాల‌యం నిర్మించుకోవ‌చ్చ‌ని తెలిపింది. అయితే, స‌ద‌రు సంఘ స‌భ్యులు మాత్రం ప‌క్క‌నే ఉన్న స‌ర్వే నెంబ‌ర్ 206లోని ప్రైవేటు భూమిని కూడా క‌బ్జా చేసి, అందులో పునాదులకు గుంత‌లు తీయ‌డం మొద‌లుపెట్టారు. ఇది నూటికి నూరుశాతం ప‌ట్టాభూమి కావ‌డం, దీన్ని ఆక్ర‌మించేందుకు కొంద‌రు ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు తెలియ‌డంతో బాధితులు 2023 ఫిబ్ర‌వ‌రిలో కోర్టును ఆశ్ర‌యించ‌గా, వారికి అనుకూలంగా ఇంజంక్ష‌న్ ఉత్త‌ర్వులు వ‌చ్చాయి. ఆ ఉత్త‌ర్వుల‌ను చూపించి.. ఇది త‌మ సొంత ప్రైవేటు భూమి అని, ఇందులో నిర్మాణ కార్య‌క్ర‌మాలు చేయ‌డం త‌గ‌ద‌ని చెప్పినా.. స‌ద‌రు సంఘ స‌భ్యులు మాత్రం త‌మ‌కు ఎమ్మెల్యే, మంత్రి అండ‌దండ‌లు ఉన్నాయ‌ని, త‌మ‌ను ఏమీ చేయ‌లేర‌ని చెబుతున్న‌ట్లు బాధితులు వాపోతున్నారు. అంతేకాదు, భూమి లోంచి వెళ్లాల‌న్నా, ప‌నులు ఆపాల‌న్నా డ‌బ్బులు సైతం డిమాండు చేస్తున్నార‌ని బాధితులు ఆరోపించారు. త‌మ సొంత భూమి కోసం వేరేవాళ్ల‌కు డ‌బ్బులు ఎందుకు ఇవ్వాల‌ని ప్ర‌శ్నిస్తున్నారు.




ఇటీవ‌ల బ‌దిలీపై వెళ్లిపోయిన ఒక త‌హ‌సీల్దారు.. దీన్ని ప్ర‌భుత్వ భూమిగా వ‌ర్గీక‌రించారు. సాక్షాత్తు న్యాయ‌స్థానం నుంచి ఇంజంక్ష‌న్ ఉత్త‌ర్వులు ఉన్నా వాటిని ప‌ట్టించుకోకుండా భూమి త‌మ‌దేన‌ని ఆక్ర‌మిస్తామంటే ఇదెక్క‌డి న్యాయ‌మ‌ని బాధితులు వాపోతున్నారు. ప్ర‌భుత్వ పెద్ద‌లు స్పందించి త‌మ‌కు న్యాయం చేయాల‌ని, త‌మ వ‌ద్ద భూమికి సంబంధించిన ఆధారాలు, కోర్టు ఇచ్చిన ఉత్త‌ర్వుల ప‌త్రాలు అన్నీ ఉన్నాయ‌ని, వాటి చ‌ట్ట‌బ‌ద్ధ‌త‌ను తేల్చిన త‌ర్వాతే త‌మ‌కు త‌మ భూమిని అప్ప‌గించాల‌ని కోరుతున్నారు.

Comments

Popular posts from this blog

కిమ్స్ సన్ షైన్ హాస్పిటల్ లో భుజం గాయాలు ఫ్రాక్చర్స్ పై వర్క్ షాప్

Poultry India/IPEMA Celebrates International Women’s Day 2025, Empowering Women in the Poultry Sector

HITAM Launches Pioneering Integrated Twinning Program in Engineering with Global University Tie-Ups